జవనిక


నిన్న నువ్వు

నాకలలోకొచ్చి చేసినచేష్టలే

నేటి నాకవితలో

నిండుగా చోటుచేసుకున్నాయి


నువ్వు ఓపువ్వును

నా చేతికిచ్చి

నవ్వులు చిందుతూ

నాముందు నాట్యంచేశావు


చిరునగవులు ఒలకబోస్తూ

చిలిపిచూపులతో ఆకట్టుకుంటూ

సోయగాల విందులిస్తూ

చిత్తుచేసి మదినికొల్లగొట్టావు


తనువును తాకుతూ

తొందరబెడుతూ

తలను నిమురుతూ

తన్మయత్వపరిచావు


నిన్న రాత్రి

నువ్విచ్చిన ముద్దు

చెంపపై ముద్రవేసి

చెరగకుండా నిలచిపోయింది


నీ ఊహలను

నా తలకెక్కించావు

నీ వయ్యారాలను

నా కళ్ళకందించావు


కవ్విస్తూ

కలంచేతికిస్తూ

కవితవస్తువునిస్తూ

కవితను వ్రాయమన్నావు


నీ అందచందాలు

నాకు అనునిత్యం కావాలి

నీ ఆనందపరవశాలు

నన్ను నిత్యం ఆహ్లదపరుస్తుండాలి


నేటి రాత్రివేళలో

నింగిలో విహరిద్దాం

నిండుచంద్రుని వెన్నెలలో

నిశిరాత్రివరకు గడిపేద్దాం


చుక్కలతో

సయ్యటలాడుదాం

మేఘాలపల్లకిలో

మనసారా ఊరేగుదాం


చేతులుకలిపి

చెట్టాపట్టాలేసుకుందాం

జతకట్టి

జల్సాలు చేసుకుందాం


తెరను 

త్వరగా తొలగిద్దాం

తలపులను

త్వరలో నిజంచేద్దాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog