కవితాంజలి
నీ ఆలోచనలు
నాలో నదిలాప్రవహించి
అందమైన రూపాలనుపొంది
అవతరిస్తున్నాయి
నువ్వు కలలోకివచ్చి
నన్ను కవ్వించి
కలంచేతికిచ్చి
కాగితాలుకాగితాలు నింపిస్తున్నావు
నిన్ను వ్రాసి
రసాస్వాదనపొంది
నామనసు పరవశించి
ఆనందంలో ఉప్పొంగిపోతుంది
నిను సృస్టించి
నాహృదయం ఆనందపడి
తనువు తన్మయత్వపడి
తృప్తితో తేలిపోతుంది
నీ మూలంగా
నాకొచ్చిన బహుమతులు
సంవత్సరాలు గడచినా
ఇంటినిండాయుండి నిన్ను గుర్తుచేస్తున్నాయి
నిన్ను తీపిగా శ్రావ్యంగా
లయతో శ్రుతిచేసిపాడినగీతాలు
నామదిలో నిలచి
నిరంతరం ప్రతిధ్వనిస్తున్నాయి
నువ్వు ఇచ్చే
అంతులేని సంతోషాలు
పాత్రలుపాత్రలు త్రాగినా ఖాళీచేసినా
మరలామరలా నిండుకొని నిత్యానందాన్నిస్తున్నాయి
నిన్ను చదివిన పాఠకులు
నిత్యమూ పరవశించి వ్యాఖ్యానాలుపంపి
నా అభిమానులుగామారి
నన్ను ఆకాశానికెత్తుతున్నారు
నిను తలచకుండా
నేనుండలేను
నువ్వు లేకుండా
నేను బ్రతుకలేను
ఇవే నీకు
పుష్పాంజలులు
ఇవే నీకు
ధన్యవాదములు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment