నా కోరికలు


పువ్వులు

పొంకాలను చూపుతుంటే

పరికించాలని

పరమానందాన్ని పొందాలని నాకోరిక


పెదవులు

చిరునవ్వులను చిందుతుంటే

మోములు వెలిగిపోతుంటేచూచి 

సంతసపడాలని నాకోరిక


మాటలు

తేనెతుంపరులను చిందిస్తుంటే

ఆస్వాదించాలని

ఆనందం పొందాలని నాకోరిక


కిరణాలు

చీకటిని పారదోలుతుంటే

ప్రభాత సూర్యునిచూచి

పరవశించాలని నాకోరిక


వెన్నెల

చల్లగా కురుస్తుంటే

జాబిల్లి మేఘాలతో దోబూచులాడుతుంటేచూచి 

తన్మయత్వపడాలని నాకోరిక


జలాలు

నిండుగా నదులలో ప్రవహిస్తుంటే

పంటలు పుష్కలంగా పండుతుంటేకని 

కుతూహలపడాలని నాకోరిక


ప్రేమలు

ఫలిస్తుంటే పెళ్ళిల్లు పెక్కుజరుగుతుంటే

ప్రేమికులను పరిరక్షించమని 

పరమాత్ముని ప్రార్ధించాలని నాకోరిక


పసిపాపలు

బోసినవ్వులు నవ్వుతుంటేచూడాలని 

ముద్దుమాటలు పలుకుతుంటేవినాలని 

బ్రహ్మానంద భరితుడనుకావాలని నాకోరిక


పరువాలు

పడతులందు పొంగిపొర్లుతుంటే

పరిహాసాలాడుతుంటే పరికించి 

ప్రమోదంపొందాలని నాకోరిక


అలలు

అంబుధిలో ఎగిరిపడుతుంటే

తీరాన్ని తాకుతుంటే

తనివితీరా చూడాలని నాకోరిక


కొండాకోనలు

పచ్చదనం కప్పుకుంటే

వానజల్లులు కురుస్తుంటేచూచి 

సంతసించాలని నాకోరిక


సెలయేర్లు

క్రిందకు ఉరకలేస్తుంటే

నెమల్లు నాట్యంచేస్తుంటే ప్రకృతినిచూచి 

పులకరించాలని నాకోరిక


విషయాలు

మనసును తడుతుంటే

కవితలు పుట్టకొస్తుంటే

కాగితలపై ఎక్కించాలని నాకోరిక


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog