ఎందుకనో?


పూలతోటమధ్యలో

పచార్లుచేయాలనియున్నది

పరిమళగంధాలను

పీల్చాలనియున్నది


చిటపట చినుకులలో

చిందులు వేయాలనియున్నది

చిన్నారి పాపలతో

సమయం గడపాలనియున్నది


ప్రవహించే నదులను

పరికించాలనియున్నది

పంటలుపండే పచ్చనిపొలాల్లో

పారాడాలనియున్నది


చెలిని చెంతకుపిలచి

కోర్కెలు తీర్చాలనియున్నది

ప్రేమాభిమానాలు పంచి

పులకరించాలనియున్నది


నీలి ఆకాశంలో

విహరించాలనియున్నది

తారల తళుకులలో

వెలిగిపోవాలనియున్నది


మేఘాలపైన యెక్కి

కూర్చోవాలనియున్నది

చల్లని వెన్నెలలో

సేదతీరాలనియున్నది


ప్రభాత సూర్యుడిని

చూడాలనియున్నది

కడలి కెరటాలను

కాంచాలనియున్నది


అన్నార్తులందరిని

ఆదుకోవాలనియున్నది

రోగబాధితులందరికి

సేవలుచేయాలనియున్నది


బాధలుపడేవారందరిని

ఓదార్చాలనియున్నది

దీనజనులందరిని

ఉద్ధరించాలనియున్నది


చిరునవ్వుల మోములను

కాంచాలనియున్నది

తేనెలొలుకు పదాలను

వినాలనియున్నది


అందమైన దృశ్యాలను

చూడాలనియున్నది

అంతులేని ఆనందాలను

పొందాలనియున్నది


కమ్మని కవితలను

వ్రాయాలనియున్నది

శ్రావ్యమైన గీతాలను

పాడాలనియున్నది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog