ఎందుకో?
మేఘాల్లోని నీరునుతెచ్చి
అందరిదాహం తీర్చాలని
అందరినీ స్నానంచేయించాలని
మనుజుల్లోని కల్మషాన్ని కడగాలనియున్నది
ఆకాశవస్త్రాన్ని తీసుకొనివచ్చి
అందరికి బట్టలు కుట్టించాలని
అందరిమొహాల్లో ఆనందంచూడాలని
అందరూ సమానులేనని చెప్పాలనియున్నది
సూర్యకిరణాలలోని కాంతినితీసుకొనివచ్చి
అఙ్ఞానాంధకారాలను పారదోలాలని
చీకట్లను శాశ్వతంగా తరిమివేయాలని
అందరిజీవితాలను ఆనందమయం చేయాలనియున్నది
చంద్రుని వెన్నెలను పట్టుకురావాలని
చల్లని గాలులు వీయించాలని
అందరిమేనుల సేదతీర్చాలని
అందరినీ ఆహ్లాదపరచాలనియున్నది
పుడమినున్న పువ్వులన్నిటిని తేవాలని
పడతులందరికి పంచాలని
అందరినీ అందంగా చూడాలని
పరిమళాలను అందరిపై చల్లాలనియున్నది
కోకిలలు అన్నింటిని ఆహ్వానించాలని
కుహూకుహూ రాగాలు తీయించాలని
కమ్మనిపాటలు పాడించాలని
అందరికీ వీనులవిందు కలిగించాలనియున్నది
అడవిలోనున్న అన్నిమయూరాలను పిలవాలని
పురులను విప్పుకొమ్మని చెప్పాలని
అందంగా నాట్యం చేయించాలని
అందరినీ పరవశింపజేయాలనియున్నది
ఇంద్రలోకానికి ఎగిరివెళ్ళాలని
అమృతాన్ని భువికి తేవాలని
అందరిచేత త్రాగించాలని
అందరినీ చిరంజీవులను చేయాలనియున్నది
అందముగా అక్షరాలను అమర్చి
పదాలను పారించి పరవళ్ళుత్రొక్కించి
భావాలను బాగుగా బహిరంగపరచి
సాహిత్యలోకంలో కవితలను చిరస్మరణీయం చేయాలనియున్నది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
9177915285/7981616630
Comments
Post a Comment