ఎంత బాగుండునో!
చీకటి బ్రతుకులలో
వెలుగులు విరజిమ్మితే
సుఖసంతోషాలు వెల్లివిరిస్తే
ఎంతబాగుండునో ఆరోజులు
రాత్రి ప్రయాణాలలో
కాంతికిరణాలు కనబడితే
దారినిచూపి నడిపిస్తే
ఎంతబాగుండునో ఆవెలుగులు
కష్టాల కన్నీళ్ళకడలిలో
చిరునవ్వులు చిందితే
చిరుమోములు వికసిస్తే
ఎంతబాగుండునో ఆదృశ్యాలు
చిమ్మ చీకట్లలో
చంద్రుడు మబ్బులువీడితే
వెన్నెల కురిపిస్తే
ఎంతబాగుండునో ఆరాత్రులు
విషాదంలో మునిగినపుడు
వికసించినపూలు కనిపిస్తే
విచారం మటుమాయమయితే
ఎంతబాగుండునో ఆక్షణం
ఆకలికొన్న చిన్నారిని
ఏడుస్తున్న బుజ్జాయిని
అమ్మ ఎత్తుకొని పాలిచ్చి లాలిస్తే
ఎంతబాగుండునో ఆసమయం
ప్రాయంలో ఉన్నట్టి
పదహారేళ్ళ యువతి
పకపకలాడుతుంటే
ఎంతబాగుండునో ఆచూపులు
కవిగారి కలమునుండి
కమ్మనికవిత జాలువారి
కళ్ళముందుకొచ్చి కుతూహలపరుస్తుంటే
ఎంతబాగుండునో ఆరాతలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment