అడుగో కవి!
ప్రకృతిని వర్ణించి
పుడమికి పచ్చదనమద్ది
పువ్వులను కళ్ళముందుంచి
ప్రజలను పరవశింపజేస్తాడట పుష్పకవి
నీలాకాశంలో పట్టపగలే
నెలవంకను నిలిపి
వెన్నెలను వెదజల్లి
విశ్వజనులను విస్మయపరుస్తాడట సహజప్రకృతికవి
ప్రేమజల్లులు కురిపించి
తడిపి ముద్దజేసి
ప్రణయలోకంలో
విహరింపజేస్తాడట ప్రణయకవి
అందాలను చూపించి
అంతరంగాలను ఆకట్టుకొని
అద్భుతప్రపంచంలోనికి తీసుకెళ్ళి
అంతులేని ఆనందాలను అందిస్తాడట అందాలకవి
మనసులను తట్టి
మదిలో తిష్టవేసి
మరోప్రపంచాన్ని చూపి
ముచ్చటపరుస్తాడట ఆనందాలకవి
అక్షరాలతో అలరించి
పదాలతో పసందుకలిగించి
సాహిత్యలోకంలో
సంచరింపజేస్తాడట సుకవి
భావాలతో రక్తిగట్టించి
కల్పనలను రంగరించి
ఊహలలలోకంలో ఉరుకులుతీయించి
హృదయాలను ఉర్రూతలూగిస్తాడట భావకవి
అటువంటి కవులను
ఆదరిద్దాం
అభినందిద్దాం
అంతరంగాలలో నిలుపుకుందాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment