సర్వేజన సుఖీనోభవంతు
పూయనీ
పువ్వులు పూయనీ
పూతోటనిండా పువ్వులు పూయనీ
పరసరాలు ప్రకాశించి పులకించనీ
పూయనీ
నవ్వులు పూయనీ
మోములనిండా నవ్వులు పూయనీ
చూచేవారికి సంతసాలను చేకూర్చనీ
పండనీ
పంటలు పండనీ
పొలాలన్ని సుభిక్షంగా పండనీ
పాటుపడ్డ రైతులను పరవశించనీ
పండనీ
నాపచేను పండనీ
నవ్విన నాపచేనుని పండనీ
నలుగురికి నయనానందం కలిగించనీ
తీరనీ
కోర్కెలు తీరనీ
సర్వులు సంతసం పొందనీ
కుతూహలంతో కేరింతలు కొట్టనీ
తీరని
ఆకలి తీరనీ
అందరి కడుపులు నిండనీ
అందరినీ ఆనందసాగరంలో తేలనీ
పడనీ
మురిసిపడనీ
ఉల్లాలు ఉత్సాహంతో
ఉఱుకులు పఱుగులతో ఉప్పొంగిపోనీ
పడనీ
తృప్తిపడనీ
తనువులు తోషంతో
తన్మయత్వం పొంది తరించిపోనీ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment