కవినేర్పు కవితలకూర్పు
కవినేర్పు
కవితలకూర్పు
అందాలనుచూపు
ఆనందాలనిచ్చు
కవితలను
వ్రాయమని
అక్షరాలు
కలమును కోరుచున్నాయి
కవితలను
పూయించమని
పువ్వులు
పొదలను ప్రార్ధిస్తున్నాయి
కవితాసౌరభాలను
వెదజల్లమని
పరిమళాలు
గాలిని కోరుతున్నాయి
కవితాకిరణాలను
ప్రసరించమని
వెలుగులు
దీపాలను వేడుకుంటున్నాయి
కవితాతేనెలను
కురిపించమని
మాధుర్యాలు
తేటులను తొందరపెడుతున్నాయి
కవితాజల్లులు
కురిపించాలని
ఆకాశం
మేఘాలను అడుగుతుంది
కవితలను
పాడమని
శబ్దాలు
కంఠములను అడుగుచున్నాయి
కవితారుచులను
అందుకోవాలని
నాలుకలు
నిరీక్షిస్తున్నాయి
కవితామృతాన్ని
క్రోలాలని
నోర్లు
ఎదురుచూస్తున్నాయి
కవితలకు
కల్పనలు జోడించాలని
మనసులు
పరితపిస్తున్నాయి
ఎక్కడనుండయినా
ఎవరి ప్రోద్భలమునయినా
ఎటువంటి కవితయినా
ఎదలకు చేరవచ్చు
కవితలను కవిగారు
వండివార్చేదెపుడో
వడ్డించేదెపుడో
వేచిచూద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment