ఎంతచక్కనివోయి మనతెలుగుతోటపూలు?
ఎంత చక్కనోయి
మన తెలుగుతోటపూలు
ఎంత పరిమళమోయి
మన నేలపూలు
ఆపూలు
ప్రియురాలిలా
పొంకాలను
ప్రదర్శిస్తున్నాయి
ఆపూలు
ప్రేయసిలా
పకపకనవ్వుతూ
పరవశపరుస్తున్నాయి
ఆపూలు
పున్నమిజాబిల్లిలా
పండువెన్నెలను
పుడమిపైకురిపిస్తున్నాయి
ఆపూలు
ప్రణయరాణిలా
పులకరించి
ప్రేమనువ్యక్తపరుస్తున్నాయి
ఆపూలు
పడతిలా
ప్రీతిగా
పలుకరిస్తున్నాయి
ఆపూలు
పడచులా
పరువాలను ఒలకబోసి
పరమానందానిస్తున్నాయి
ఆపూలు
కళ్ళకు
కమ్మదనాన్ని
కలిగిస్తున్నాయి
ఆపూలు
అందాలను ఆరబోస్తూ
అంతరంగాన్ని
అలరిస్తున్నాయి
ఆపూలు
పరిమళాలను చల్లుతూ
పీల్చుకోమంటూ
పిచ్చెక్కిస్తున్నాయి
ఆపూలు
పెళ్ళిచేసుకోమంటున్నాయి
పూలదండలను
మార్చుకోమంటున్నాయి
ఆపూలు
పడతులకొప్పులలో తురుమమంటున్నాయి
పరవశంతో
పొంగిపొర్లిపొమ్మంటున్నాయి
ఆపూలు
పరమాత్మునికి సమర్పించమంటున్నాయి
పరమభక్తితో
పూజలను చెయ్యమంటున్నాయి
ఆపూలు
మాలలుగా అల్లమంటున్నాయి
మహనీయుల మరియు మహాకవుల
మెడలోవేసి సన్మానించమంటున్నాయి
ఆపూలు
ప్రేమాభిషేకం చేస్తున్నాయి
పుష్పాంజలులు ఘటిస్తున్నాయి
ప్రకృతిని పరవశపరుస్తున్నాయి
ఎంత మంచివోయి
మన తెలుగుపూలు
ఎంత గొప్పవోయి
మన నేలపూలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment