మనిషంటే మనసే మనసంటే మేధస్సే
(మనసు)
తలలో
ఉన్నతస్థానం సంపాదించింది
ఆపాదమస్తకం మనిషిని
ఆధీనంలోనికి తీసుకున్నది
శరీరాన్ని
స్వాధీనంలోనికి తెచ్చుకున్నది
నిటారుగా
నిలబడటం నేర్పింది
కళ్ళతో
కాంచటం మొదలుపెట్టింది
విషయాలను
తలకెక్కించుకోవటం ప్రారంభించింది
వీనులతో
వినటం నేర్చుకున్నది
విఙ్ఞానాన్ని
విస్తరించటం కనుగొన్నది
పరిమళాలను
పీల్చటం తెలుసుకొన్నది
పరవశంతో
పులకరించటం ఆరంభించింది
స్పర్శలకు
ప్రతిస్పందించటం ప్రారంభించింది
చర్యలకు
ప్రతిచర్యలు మొదలుపెట్టింది
రుచులను
ఆస్వాదించటానికి అలవాటయ్యింది
అన్నిటిని తినాలని
ఆరాటపడుతుంది
మాటలలో
తేనెలు చిందటం కనిపెట్టింది
మోములలో
చిరునవ్వులు చూపించటం తెలుసుకున్నది
కాళ్ళతో
నడవడటం ఆరంభించింది
కోరినచోటుకు
వెళ్ళడం తెలుసుకున్నది
చేతులతో
పనులు చేయడం నేర్చుకున్నది
ఇష్టమైనవి అవసరమైనవి
చేయటం ప్రారంభించింది
నోటితో
బాషను మాట్లాడటం నేర్చుకున్నది
సమాచారాన్ని
ఇచ్చిపుచ్చుకోవటం ఆరంభించింది
ప్రేమను
పంచటం ప్రారంభించింది
బంధాలను
పెంచుకోవటం నేర్చుకున్నది
దేహాన్ని
వశపరచుకొని తృప్తిపడకున్నది
ప్రక్కవారి శరీరాలపై
పెత్తనానికి ప్రయత్నిస్తుంది
అందాలను
చూడాలని ఆశలుపెట్టుకున్నది
ఆనందాలను
పొందాలని అర్రులుచాస్తున్నది
ఆలోచనలను
ఆరంభించింది
కవితలు
వ్రాయటం మొదలుపెట్టింది
ఆకాశంలో
విహరించటం నేర్చుకున్నది
నీళ్ళపై
పయనించటం తెలుసుకున్నది
మనిషంటే
మనసే
మనసంటే
మేధస్సే
గుండ్లపల్లి
రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment