ఎన్నాళ్ళో?


బాల్యము పోయింది

ఙ్ఞాపకాలను మిగిల్చింది

పుట్టినఊరికి దూరమయ్యాను

ప్రాణమిత్రులకు ఎడమయ్యాను


భార్య వచ్చింది

బాధ్యతలు పెంచింది

సంసారంలో దిగాను

సముద్రాన్ని ఈదుతున్నాను

 

యవ్వనం పోయింది

స్మృతులు తరుముతున్నాయి

ఉద్యోగంనుండి విశ్రాంతిదొరికింది

సంపాదన అడుగంటింది


సంబంధాలు పోయాయి

సంతోషాలు పోయాయి

తల్లి గతించింది

మరణించాడు తండ్రి


కోదళ్ళు వచ్చారు

కొడుకులు దూరంగావెళ్ళారు

మనుమలను చూడలేకపోతున్నాను

మనుమరాళ్ళతో ఆడుకోలేకపోతున్నాను


ఆప్యాయతలు తగ్గాయి

ఆనందాలు తగ్గాయి

ముసలితనము వచ్చింది

భార్యయే దిక్కయింది


కవితాకన్యక తోడయ్యింది

కలలోకొచ్చి కవ్విస్తుంది

కవితావిషయాలను ఇస్తుంది

కవనకుతూహలం కలిగిస్తుంది


కలం తోడయ్యింది

కల్పనలు తోస్తున్నాయి

కవితలు వస్తున్నాయి

కాగితాలపైకి ఎక్కుతున్నాయి


కవితాస్నేహం 

ఎన్నాళ్ళో

కవితలువ్రాసేది

ఎన్నాళ్ళో


ముసలిజీవితం 

ఎన్నాళ్ళో

ముసలిదానిసహచర్యం

ఎన్నాళ్ళో


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog