ఒంటరినైపోయాను


ప్రేమలూ విధేయతలు

అంతా బూటకం

ప్రమాణాలు వాగ్దానాలు

అంతా నాటకం


ఎవరికి ఎవరూ

ఏమీకారు

సంబంధాలన్నీ

శాశ్వతముకాదు


నీ రక్తమే

నిన్ను చివరకు

భగభగా దహిస్తుంది

బూడిదగా మారుస్తుంది 


గాలిలో

ఎగిరేవారయినా

మట్టిలో

కలవాల్సిందే


సుఖంగాయున్నప్పుడు

అందరూ తోడుకువస్తారు

దుఃఖములో యున్నప్పుడు

అందరూ ముఖంచాటేస్తారు


నీవాళ్ళలాగే

నీప్రక్కనేవుంటారు

నువ్వుచిక్కావంటే

నీగుండెనుబద్దలుచేస్తారు


పాలల్లో

విషంకలుపుతారు

ప్రేమగాయిచ్చిత్రాగించి

ప్రాణాలుతీస్తారు


మాటలుచెప్పి మోసంచేస్తారు

నాటకమాడి నమ్మిస్తారు

కళ్ళల్లో కారంకొడతారు

కపటంజేసి కాజేస్తారు


దేవునికి పూజలుచేస్తారు

దైవానికే ద్రోహంచేస్తారు

మనుషులను లెక్కచేయ్యరు

బాంధవ్యాలకు విలువనివ్వరు


చిక్కితే

చితకకొడతారు

నక్కితే

నలగకొడతారు


మెత్తగాయుంటే

నలిపేస్తారు

గట్టిగాయుంటే

పగలగొట్టిపిండిజేస్తారు


నిలుచుంటే

నిందలేస్తారు

ప్రక్కకుపోతుంటే

వెంటబడివేధిస్తారు


కోరినవాటిని

ఇవ్వమంటారు

వద్దన్నవాటిని

పైనరుద్దుతారు


అనురాగం ఆప్యాయత

అంతా  అబద్ధం

పైకి ఒకటిచెబుతారు

బయట వేరొకటిచేస్తారు


ప్రేమించానన్నది

పెళ్ళిచేసుకుందామన్నది

ప్రమాణంచేసింది

పాతాళానికిత్రోసింది


వలపువలలో పడ్డాను

చెప్పినమాటలు నిజమనుకున్నాను

నమ్మకాన్ని వమ్ముచేసింది 

జీవితాన్ని నాశనంచేసింది


ప్రేమజోలికిపోను

పెళ్ళిజేసుకోను

బంధాలనుపెట్టుకోను

బాధలనుపెంచుకోను


ప్రమాణము వాగ్దానము

మమకారము విశ్వాసము

నిఘంటువులోని పదాలు 

కావుహృదిలోని నిజభావాలు


ప్రేమలను నమ్మనూ

స్నేహాలను నమ్మనూ

బంధాలను నమ్మనూ

లోకాన్నే నమ్మనూ


ఒంటరిగానే ఉంటాను

పస్తులైనా ఉంటాను

ఏడుస్తూనే ఉంటాను

ఏకరువుపెడుతూనే ఉంటాను


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


(నా కవితలు ఎక్కువుగా అందం, ఆనందం, పూలు, పడతులు, ప్రణయం మరియు ప్రబోధాల పైన ఉంటాయి. మనసులను తట్టటమే నా కవితల లక్ష్యం. ఒక పాఠకుని కోరికపై ఈ కవితను వ్రాశాను. వ్రాసిన నాకే జాలివేసింది, ఏడుపొచ్చింది. పాఠకులను నొప్పించటం ఇష్టంలేక కొన్ని పాదాలను తొలగించాను.)


ఈరోజు బుచ్చిబాబు జయంతి. మహారచయితకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, నీరాజనాలు సమర్పిస్తూ చివరకు మిగిలేది నవల ముఖ చిత్రాన్ని నా కవితకు వాడాను. పాఠకులు గమనించ మనవి


Comments

Popular posts from this blog