చంటోడి స్వగతం
పుట్టగానే ఏడ్చా
పరమాత్ముని వీడి
పుడమిపై పడ్డందుకు
క్షీరంకుడిపితే త్రాగా
కన్నతల్లి ప్రేమరుచిని
కనుగొనేందుకు
వంటిపైన చెయ్యేస్తే
స్పర్శానుభూతిని పొందా
హాయిగా నిదురబోయా
నాన్న ఎత్తుకుంటే
నాకు కావలస్నవాడని
నేను మురిసిపోయా
ఉయ్యాలలోవేసి ఊపితే
గాలిలో తేలిపోతున్నట్లుగా
సంబరపడిపోయా
ప్రక్కవాళ్ళు పలకరిస్తే
పరిచయం చేసుకుంటే
పకపకనవ్వా
అన్నను చూశాక
ఆటలు ఆడాలని
ఆరాటపడ్డా
అక్క పలకరించాక
అనురాగం ఆప్యాయతలను
అందరికి అందించాలనుకున్నా
అంగీ తొడిగితే
అంగాలకు రక్షణదొరికిందని
అనందపడిపోయా
అన్నప్రాశన చేస్తే
అరిగించుకునే శక్తివచ్చిందని
సంతసించా
పేరుపెట్టిపిలిస్తే
గుర్తింపువచ్చిందని
కుతూహలపడ్డా
కళ్ళతోచూచా
కమ్మదనాన్ని
క్రోలుకొనటంమొదలుపెట్టా
చెవులతోవిన్నా
శ్రావ్యతేమిటో
తెలుసుకున్నా
రానున్న రోజుల్లో
నడక నేర్చుకుంటా
మాటలు నోట్లోచిందిస్తా
తినటం తెలుసుకుంటా
చదువులు నేర్చుకుంటా
ఉద్యోగాలు చేస్తా
సంపాదన పొందుతా
స్వతంత్రుడిగా బ్రతుకుతా
శిరసువంచుతా
సపర్యలుచేస్తా
పూజలుచేస్తా
నమస్కరిస్తా
పెద్దల్లారా
దీవించండి
గురువుల్లారా
ఆశీర్వదించండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment