పువ్వుల ప్రాశస్త్యం


పరమాత్ముడే పువ్వులకు ప్రీతిపాత్రుడయ్యాడు

పొంకాలనందించాడు

పరిమళాలనిచ్చాడు

పలురూపాలనిచ్చాడు


పువ్వులది

భాగ్యమే భాగ్యం

భగవంతుని పాదాలుచేరుతున్నాయి

భామల కొప్పులకెక్కుతున్నాయి


పువ్వులు

అమ్మోరులకు ఆసనాలయ్యాయి

కోమలాంగుల కళ్ళల్లోచేరుతున్నాయి

కవుల కవితల్లోకనబడుతున్నాయి 


పువ్వులు ప్రొద్దుప్రొద్దునే

పరమాత్మునిచే పుట్టించబడుతున్నాయి

పలురంగులను అద్దించుకుంటున్నాయి

పరాగాన్నితేనెలను నింపించుకుంటున్నాయి


తేటులను పిలుస్తున్నాయి

తేనెను పంచుతున్నాయి

కవులను తడుతున్నాయి

కవితల్లోకి ఎక్కుతున్నాయి


అలరుల అందాలనుచూచి

అప్సరస అసూయపడి

అవనివాసులకు తనతోపనిలేదని

అమరలోకానికి వెళ్ళిపోయింది


పువ్వుల సుగంధాలనుపీల్చి 

పరవశించి పోయి

పరిమళద్రవ్యాలు ఆశ్ఛర్యపడి

ప్రక్కకు తప్పుకున్నాయి


పుష్పాల రంగులను చూచి

హరివిల్లు సంబరపడి

వాటిముందు తాను తీసుకట్టని

దూరంగా తరలిపోయింది


పువ్వులతేనెల రుచిచూచి

పనసతొనలు పండ్లు

పంచదారమిఠాయిలు అబ్బురపడి

తలను క్రిందకు దించుకున్నాయి


అలరుల ఆకర్షణనుచూచి

ఆయస్కాంతం అచ్చెరువొంది

అంతటిశక్తి తనకులేదని

అక్కడనుండి తప్పుకుంది


పూలవెలుగును చూచి

పున్నమివెన్నెల ఈర్ష్యపడి

పుడమికి తనతో పనిలేదని

పడమటదిక్కుకు పయనమైపోయింది


పూబాలల ప్రాభవాన్ని తెలుసుకొని

పూలకు తముసాటిగాదని ఎరిగి

పువ్వారులను పడతులు మంచిచేసుకొని

పువ్వులను  తమతలలపైకి ఎక్కించుకున్నారు 


ఆహా.. అలరులదే

అందము

అదృష్టము

అందలము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog