ఎవరునేర్పారమ్మ ఈపూలకు?


తోటలో

సందడిచేయ్యమని

చూపరులకు

సంతసమివ్వమని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


కళ్ళకు

కాంతులివ్వమని

పెదవులకు

చిరునవ్వులివ్వమని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


సౌందర్యాలు

చూపమని

సుగంధాలు

చల్లమని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


గాలికి

నాట్యమాడమని

వెలుతురికి

మెరిసిపొమ్మని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


పరమాత్మునిపాదాలుచేరి

ధన్యతనుపొందమని

తరుణులతలలకెక్కి

అందాలనురెట్టింపుజెయ్యమని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


ప్రేమలు

పుట్టించమని

ఆప్యాయతలు

అందించమని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


సున్నితంగా

ఉండమని

సుఖంగా

జీవించమని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


మట్టిలోను

పుయ్యమని

నీళ్ళలోను

పూయమని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


చెట్లకు

పుట్టమని

తీగలకు

వేలాడమని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


కొండల్లో

పుష్పించమని

కోనల్లొ

కుసుమించమని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


ఆకులమధ్య

పుట్టమని

ముళ్ళమధ్య

పెరగమని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


నేలరాలినా

లాలిత్యంనిలుపుకోవాలని

మట్టిలోకలసినా

మృదువుగానేయుండాలని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


వానకుతడిసినా

వయ్యారాలు ఒలుకాలని

ఎండలబారినపడినా

తాజాగాయుండాలని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


సూదులతోగుచ్చినా

మురిపించాలని

దారాలతోకట్టినా

ముచ్చటపరచాలని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


వివిధరూపాల్లో

వికసించాలని

వివిధరంగుల్లో

వర్ధిల్లాలని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


మనసులకు

ఆలోచనలివ్వమని

కవితలకు

కారణముకమ్మని

ఎవరునేర్పారమ్మ ఈపూలకు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog