కవితాప్రవాహం
గాలి వీచినట్లు
సుగంధాలు వ్యాపించినట్లు
ఆలోచనలు పారుతున్నాయి
నది ప్రవహించినట్లు
నీరు పరుగెత్తినట్లు
భావాలు పొంగిపొర్లుతున్నాయి
కిరణాలు ప్రసరిసంచినట్లు
చీకటి పారిపోయినట్లు
మనసు చలిస్తుంది
పూలు అల్లినట్లు
పూసలు గుచ్చినట్లు
అక్షరాలు అమరుతున్నాయి
చీమలు బారులుతీరినట్లు
పక్షులు కలసి ఎగిరినట్లు
పదాలు వరుసకడుతున్నాయి
విషయాలు తట్టి
పంక్తులు ఏర్పడి
కవితలు పుడుతున్నాయి
అందాలు కనిపించి
కనువిందులు చేసి
ఆనందాలు కలిగిస్తున్నాయి
కలాలు పరుగెత్తి
కాగితాలు నింపి
కవనం కొనసాగుతుంది
కవితాకన్యక కవ్వించి
శారదాదేవి కరుణించి
సాహిత్యం వెలువడుతుంది
అక్షరసేద్యం కొనసాగిస్తా
కవితలపంటను పండిస్తా
సాహిత్యాన్ని సుభిక్షంచేస్తా
హయగ్రీవునికి
హారతులు
వాగ్దేవికి
వందనాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment