చెలిప్రేమ
(సల్లాపము(గజల్))
పూలుతెచ్చి చెలియమీద చల్లాలని నాకున్నది
చెలిమోమున చిరునవ్వులు చూడాలని నాకున్నది
అందాలను అన్నింటిని తేరపార కనులజూచి
ముద్దూమురిపాలతోడ మురియాలని నాకున్నది
చెలినిపిలిచి చేతిలోకి తీసుకోని చంపనిమిరి
సరససల్లాపములలో ముంచాలని నాకున్నది
మల్లెపూల తోటలోన ముచ్చటలను చెప్పుకొనుచు
చందమామ వెన్నెలలో తిరగాలని నాకున్నది
నింగిలోన తేలియాడు మేఘాలను పారజూచి
తళతళమను తారకలను ఎంచాలని నాకున్నది
మల్లెపూలు కోసకొచ్చి ముచ్చటగా మాలనల్లి
సుందరాంగి కొప్పులోన తురమాలని నాకున్నది
అచ్చతెనుగు పదములందు కవిరాజుగ కవితవ్రాసి
శ్రావ్యమయిన పాటనొకటి పాడాలని నాకున్నది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment