వ్రాస్తున్నా చూస్తున్నా!
ఉషోదయ కిరణాలను
వడిసిపట్టుకొని
వచనకవితలకు రంగరించి
వండివడ్డించాలని చూస్తున్నా
పున్నమి వెన్నెలను
పట్టుకొని పాత్రలనిండాతెచ్చి
ప్రణయకవితలపై పులిమి
పాఠకులకుచేర్చాలని చూస్తున్నా
మల్లేపూల పరిమళాలను
తోటనుండి తీసుకొచ్చి
మాటల మూటలపై
అక్షరతోరణాలపై చల్లాలనిచూస్తున్నా
అడవికెళ్ళి పుట్టతేనెను
సేకరించి ఇంటికితెచ్చి
అచ్చతెనుగు కవితలపై అద్ది
అందరికి అందించాలనిచూస్తున్నా
చెలి చిరునవ్వులను
చేతిలోనికి తీసుకొని
చక్కనికవితలపై చేర్చి
చిరుదివ్వెలుగా వెలిగించాలనిచూస్తున్నా
పెక్కుకవితలను వ్రాసి
పలువురికి అందించి
ఫేసుబుక్కుసభ్యుల మనసులను
తట్టాలని చూస్తున్నా
శారదాదేవి
కరుణకటాక్షాలతో
కమ్మని కవితలపంటను
పండించాలని చూస్తున్నా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment