ఎవరో ఎందుకో?
తూర్పున ఎవరో
రోజూదీపాన్ని వెలిగిస్తున్నారు
కాలచక్రాన్ని ఎందుకో
ముందుకు కదిలిస్తున్నారు
చెట్లకు ఎవ్వరో
మొగ్గలు తొడుగుతున్నారు
రంగులు ఎందుకో
అందంగా అద్దుతున్నారు
తల్లులను ఏలనో
పిల్లలను కనమంటున్నారు
లోకానికి ఎందుకో
కొత్తదనాన్ని చూపిస్తున్నారు
ఆకాశానికి ఎవరో
నీలిరంగు పులుముతున్నారు
మబ్బులమధ్య ఎందుకో
కాంతిబింబాన్ని తిప్పుతున్నారు
నింగిలో ఎవరో
మేఘాలను కరిగిస్తున్నారు
నేలపై ఎందుకో
వానలు కురిపిసున్నారు
అందకత్తెలను ఎవరో
అవనిలో సృష్టిస్తున్నారు
లోకాన్ని ఎందుకో
ఆనందమయం చేస్తున్నారు
పుటలపై ఎవరో
అక్షరాలు నింపుతున్నారు
మనసులను ఎందుకో
కవనాలతో ముచ్చటపరుస్తున్నారు
సృష్టించిన వానికి
శతకోటి వందనాలు
సృష్టించబడిన వాటికి
సహస్ర ధన్యవాదాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment