పూలపాఠాలు


పువ్వులకు

కులుకులెక్కువ

జీవితాంతము

నవ్వుతూ గడుపమంటవి


పువ్వులకు 

వగలు ఎక్కువ

అందాన్నిచూపి

ఆనందాన్ని ఇవ్వమంటవి


పువ్వులకు

పలుకులెక్కువ

పిలిస్తే

ప్రీతిగా పలుకరిస్తవి


పువ్వులకు

సుకుమారమెక్కువ

పట్టుకుంటే

కందిపోతవి


పువ్వులకు

బింకమెక్కువ

భయపెడితే

వణికిపోతవి


పువ్వులకు

మమకారమెక్కువ

ప్రేమిస్తే

ప్రాణమిస్తవి


పువ్వులకు

ప్రేమ ఎక్కువ

ప్రణయమే

జీవితమంటవి


పువ్వులకు

పరిమళమెక్కువ

ప్రక్కనున్నవారిని

పులకరిస్తవి


పువ్వులకు

ప్రకాశమెక్కువ

పలురంగులలో

ప్రజ్వరిల్లుతుంటవి


పువ్వులకు

బిడియమెక్కువ

సిగ్గులతో

సంబరపరుస్తవి


పువ్వులకు

ఆకర్షణ ఎక్కువ

ఆయస్కాంతంలా

అందరిని ఆకట్టుకుంటవి


పువ్వులకు

పడతులపై ఇష్టమెక్కువ

కోమలాంగుల కొప్పులజేరి

కుతూహలపరుస్తవి


పువ్వులకు

భక్తి ఎక్కువ

పరమాత్మునిపాదాలుచేరి

పూజించి పరవశిస్తవి


పువ్వులకు

కవులపై మక్కువ ఎక్కువ

పూలకవితలు వ్రాస్తే

పొగడ్తలకు పొంగిపోతవి


పువ్వులకు

అభివందనాలు

పూలప్రేరణకు

బహుధన్యవాదాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog