పూలదీవి
నిన్నరాత్రి
నిదురించేవేళ
నానారకాలపూలు
నాపడకచుట్టూచేరి నాట్యమాడాయి
మేనుతట్టి
మేలుకొలిపి
మొరపెట్టి
మాటతీసుకొని మరలిపోయాయి
పర్యావరణాన్ని
పాడుచేస్తున్నారని
ప్రాణాలతో ప్రజలమధ్య బ్రతకలేమని
బావురుమని విలపించాయి
కోమలాంగులు కళ్ళారాచూచి
కుతూహలపడక
కుట్టుతున్నారు సూదులతో
కడుతున్నారు దారాలతోనన్నాయి
ప్రేమికులు
పూలుపెట్టుకున్న పడతులను
ప్రోత్సహిస్తున్నారు
పరికించి పరవశించిపోతున్నారు
రెక్కలు విరిచి
నీటిలో ఉడికించి
అత్తరులను సీసాలనింపి
అమ్ముకుంటున్నారు పైనచల్లుకుంటున్నారు
వాడి రాలిపోగానే
చీపుర్లతో చిమ్మి
కాళ్ళతో తొక్కి
చెత్తకుప్పల్లో పడవేస్తున్నారు
దయచూపి
దేశాన్ని దాటించి
దీవిలోనికితీసుకెళ్ళి నాటి
ధన్యులనుచెయ్యమన్నాయి మాటతీసుకొనివెళ్ళాయి
పూల కోరికమేరకు
చెట్లను పెకిలించి
విత్తనాలను సేకరించి
పూలదీవికితీసుకెళ్ళి పాదుల్లోపాతాను
పాకుతున్న
పూలతీగలను
పీకేసి
పూలదీవిలో బారులుగానాటాను
పగలనక రేయనక
పొద్దుననక సాయంత్రమనక
పూలతోనే పూర్తిగాగడిపా
పుష్కలంగా పువ్వులనుపూయించాను
ఎవరూ తాకకుండా
ఎవరూ తెంచకుండా
ఏతుమ్మెదలు వాలకుండా
ఏపుగా చెట్లనుతీగలనుపెంచాను
పూలదీవికి
పేరుప్రఖ్యాతులుతెచ్చా
ప్రపంచంలోనే
బహుసుందరప్రాంతంగా తీర్చిదిద్దాను
పరిసరాలను కాపాడి
పూలను సంతసపరచి
పూల జీవితకాలాన్ని
పాటుబడి పెంచాను
పూలు
పూర్తిస్వేచ్ఛను పొంది
పూలదీవిని
పలురకాలుగా సుసంపన్నంచేశాయి
రారండోయ్ రారండోయ్
పూలదీవికి రారండోయ్
చూడండోయ్ చూడండోయ్
పూలఅందాలను చూడండోయ్
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment