నా రుబాయీలు
ఆలోచిస్తే అద్భుతాలను సృష్టించగలవు
కష్టపడితే అసాధ్యాలను సాధించగలవు
మనసులో జీవితలక్ష్యాలను పెట్టుకో
ప్రయత్నిస్తే ఆశయాలను అందుకోగలవు
పువ్వునుచూస్తే ప్రేమ పుట్టుకొస్తుంది
నవ్వునుచూస్తే మోము వెలిగిపోతుంది
కొన్నివిషయాలు కొన్నిటిని ఉసిగొల్పుతాయి
చెలినిచూస్తే మనసు ఉప్పొంగిపోతుంది
ఎండలో తిరగాలని ఎవరికుంటుంది
వానలో తడవాలని ఎవరికుంటుంది
అందరు దుఃఖాలను దూరంపెడతారు
కష్టాల్లో పడాలని ఎవరికుంటుంది
కర్రతో కొడితే దెబ్బతగులుతుంది
కత్తితో పొడిస్తే గాయమవుతుంది
ఆయుధాలున్నాయని ఉపయోగించకు
మాటలతో తిడితే మదినొచ్చుకుంటుంది
చీమ చిటుక్కుమంటే పట్టేస్తాయి చెవులు
దోమ కుట్టిందంటే కదులుతాయి చేతులు
దేవుడు మానవులకు తెలివిని ఇచ్చాడు
భ్రమ కలిగిందంటే చలిస్తాయి మదులు
కన్నుపడితే కోర్కె కలుగుతుంది
మనసుపడితే ప్రేమ జనిస్తుంది
ఆలోచనలు లేస్తే ఆగవు
చూపులుకలిస్తే చెలిమి పుడుతుంది
తేగలిగితే జాబిలిని పట్టుకురా
లేకపోతే పువ్వులను తీసుకురా
మనసును మురిపించాలనుకుంటే
చల్లని చిరుగాలిని తోలుకురా
పుట్టటం ఎవరికి తెలుస్తుంది
గిట్టటం ఎవరికి తెలుస్తుంది
అవి విధియాడే నాటకాలు
పెరగటమే నీకు తెలుస్తుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment