కవితాసేద్యం


మట్టిమెదడును

దున్నుతా

కవితాసాగుకు

యోగ్యంచేస్తా


అక్షరాలను

వెదజల్లుతా

కవితాపంటలను

పండిస్తా


పదాలను 

నాటుతా

కవితావనమును

సృష్టిస్తా


ఊహలను

ఊరిస్తా

కవితాలోకంలో

విహరింపజేస్తా


భావమేఘాలను

పుట్టిస్తా

కవితాజల్లులను

కురిపిస్తా


కవితలపంటలను

పండిస్తా

మనోక్షామాన్ని

నివారిస్తా


అందాలను

చూపిస్తా

ఆనందాలను

పంచేస్తా


కవితామృతాన్ని

అందిస్తా

ఆకలిదప్పుల

తీర్చేస్తా


సుకవితలను

సృష్టిస్తా

సాహితీలోకంలో

స్థిరంగానిలచిపోతా


ప్రణయకవితను

పండిస్తా

ప్రేమికులను

పరవశపరుస్తా


పుష్పకవితలు

పుట్టిస్తా

పలువురిమనసులను

పులకరిస్తా


ప్రబోధకవితలను

పుటలకెక్కిస్తా

సమాజాన్ని

చైతన్యపరుస్తా


సరస్వతీదేవిని

స్తుతిస్తా

సాహిత్య

సేవనుకొనసాగిస్తా


పాఠకులారా

ప్రోత్సహించండి

దేవతలారా

దీవించండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog