అలిగినవేళనే చూడాలి


అలిగినవేళనే చూడాలి

రోజాపూల అందాలను

ఎరుపెక్కిన బుగ్గలను


మూతిబిగించినవేళనే చూడాలి

మందారాల కోపతాపాలను

ముకుళించిన నేత్రాలను


తలవంచినవేళనే చూడాలి

తల్లడిల్లే మల్లెపూలను

తనివితీరని తాపత్రయాలను


మోముప్రక్కకుతిప్పినవేళనే చూడాలి

సన్నజాజుల ఎడమొహాన్నిపెడముఖాన్ని

చిన్నబోయిన చిరువదనాన్ని


కలతచెందినవేళనే చూడాలి

కలువపూల కష్టాలను

కుమిలిన కోమలహృదయాలను


కస్సుబుస్సులాడుతున్నవేళనే చూడాలి

తామరపూల తాపాలను

తన్మయపరచే అందచందాలను


దూషణలకు దిగినవేళనే చూడాలి

సంపంగుల కోపావేశాలను

చెంతకుతీసుకొనిలాలించి చెప్పాలిముచ్చట్లను


కొరకొరలాడుతున్నప్పుడే చూడాలి

కనకాంబరాల విషాయింపులను

కుతూహలపరచి తీర్చాలికోర్కెలను


అలకపానుపునెక్కినవేళనే చూడాలి

చామంతుల చక్కదనాలను

పెంకి పెదవివిరుపులను


బుంగమూతిపెట్టినవేళనే చూడాలి

బంతిపూల భావప్రకటనలను

బ్రతిమలాడి బుజ్జగించేసన్నివేశాలను


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


పూలు ఎందుకో రెండు రోజులనుండి అలిగాయి. బహుశా పూలకవితలను వ్రాయలేదనేమో. ఆ భావమునుండి పుట్టినదే ఈకవిత. ఇక్కడ పువ్వులు అంటే పూబోడులుగా అనువయించుకొని మరోకోణంలోనూ చూడాలని విఙ్ఞప్తి.



Comments

Popular posts from this blog