అందచందాలు చూడాలని నాకున్నది

(గజలు)


అందాలను కంటినిండ చూడాలని నాకున్నది

ఆనందము మనసునిండ నింపాలని నాకున్నది


తెల్లవారు సమయమందు పెందలకడ నిదురలేచి

అరుణకిరణముల తూర్పున చూడాలని నాకున్నది


నీలిగగనమందు మేఘములమధ్యన తిరుగుతున్న 

చందమామ సొగసులన్ని చూడాలని నాకున్నది


సాయంసంధ్యావేళన ఒంటరిగా తోటకెళ్ళి 

విరులచూచి సంతసపడి పోవాలని నాకున్నది


ఎత్తుకు ఎగిసిపడుతున్న అలసిపోని అలలచూచి

కడలితీరమందు కులుకులాడాలని నాకున్నది


చిలిపినవ్వులు చిందేటి ప్రియురాలును పిలుచుకోని

చిరుమోమును పదేపదే చూడాలని నాకున్నది


కలముపట్టి కవిరాజుగ కమ్మనయిన కవితనల్లి

కర్ణములకు ఇంపునివ్వ పాడాలని నాకున్నది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog