చిన్నవని ఉపేక్షించకు


నిప్పురవ్వలు

కోట్లాస్తులను బూడిదచేస్తాయి

చిన్నవని ఉపేక్షించకు


నీటిచుక్కలు

మహాసముద్రాలను సృష్టిస్తాయి

మూలాలు తెలుసుకో


అక్షరాలు

గొప్పకావ్యాలను ముందుంచుతాయి

విలువలు కనుక్కో


చిన్నవిత్తనాలు

పెనువృక్షాలుగా ఎదుగుతాయి

నగ్నసత్యాలను ఎరుగు


పరమాణువులు

భీకరవిస్పోటాలను కలిగిస్తాయి

చిన్నవని నిర్లక్ష్యంచేయకు


చిన్నకోర్కె

పెద్దపనులు చేయిస్తుంది

ఆశయాలను ఏర్పరుచుకో


ఉడుతసాయం

దేవుని ఆకర్షించింది

చిన్నసాయాలనయినా అందించు


చిన్నపామైనా

కరిసి విషంతోచంపుతుంది

అశ్రద్ధ వహించకు


పైసాలుదాస్తే

వేలకువేలు కూడతాయి

పొదుపుచెయ్యటం మొదలుపెట్టు


చిన్నచీమలైనా

పామును చంపేస్తాయి

ఐకమత్యమేబలమని తెలుసుకో


గడ్డిపోచలైనా

గజమును బంధిస్తాయి

వాస్తవాన్ని గ్రహించు


చిన్నదని ఏమారకు

పెద్దదని భయపడకు

ప్రణాళికతో పయనించు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog