నా కవిత 


ఎన్నాళ్ళ కెన్నాళ్ళకొచ్చావె కవిత

ఎదురుగా నిలిచావె కవిత

ఏమేమోవిషయాలు చెప్పావె కవిత

ఎదను దోచేసేవె కవిత


కళ్ళకు కాంతులిచ్చావె కవిత

చెవులకు శ్రావ్యతనిచ్చావె కవిత

చేతికి అరటిపండునిచ్చావె కవిత

తృప్తిగా ఆరగించమన్నావె కవిత


కవ్వించి నిలిచావె కవిత

ఊహలను పారించావె కవిత

భావాలు బయటపెట్టమన్నావె కవిత

మదినితట్టి మురిపించావె కవిత


అందాలు చూపావె కవిత

ఆనందమిచ్చావె కవిత

అక్షరాలు అందించావె కవిత

పదాలను పారించావె కవిత


కోకిలగానం వినిపించావె కవిత

నెమలినృత్యం చూపించావె కవిత

పచ్చదనం పుడమికికప్పావె కవిత

కవనం సాగించమన్నావె కవిత


పండువెన్నెల కురిపించావె కవిత

చల్లగాలి వీయించావె కవిత

కలము చేతికిచ్చావె కవిత

కాగితాలు నింపించావె కవిత


పూదోటకు తీసుకెళ్ళావె కవిత

పూలమధ్య తిప్పించావె కవిత

పొంకాలను చూపించావె కవిత

పరిమళాలని వెదజల్లావె కవిత


ఆకాశానికి ఎగిరించావె కవిత

మేఘాలలో విహరింపజేశావె కవిత

తారలతళుకులు చూపించావె కవిత

వానజల్లులు కురిపించావె కవిత


తెలుగుగొప్పదనమును చెప్పావె కవిత

తెలుగుతీయదనమును చూపావె కవిత

తెలుగును వెలిగించమన్నావె కవిత

తెలుగులోకవనం చేయమన్నావె కవిత


నా కవిత

నా సొత్తు

నా పొత్తు

నా మత్తు


నా పలుకు

నా కులుకు

నా తళుకు

నా బెళుకు


నా కవిత్వం

నా ఇష్టం

నా కష్టం

నా అదృష్టం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog