మీరూ కలుస్తారా!


జీవితగమనాన

బ్రతుకుపోరాటాన

జనసముద్రాన

పయనించలేకున్నా


వంకరటింకర దారిలో

వెళ్ళలేకున్నా

రాళ్ళరప్పల మీదగా

నడవలేకున్నా


నదీనదాల్లాంటి అడ్డులను

దాటలేకున్నా

ఎత్తైనకొండల్లాంటి ఆశయాలను

చేరలేకున్నా


కీకర జనారణ్యాలలో

తిరగలేకున్నా

నరరూపమృగాలతో

వేగలేకున్నా


కటికచీకటిలో

కాలు కదపలేకున్నా

కడలిలాంటి జీవితంలో 

సంసారాన్ని ఈదలేకున్నా


తోడులేకుండా

ఉండలేకున్నా

నీడలేకుండా

బ్రతుకలేకున్నా


కర్ణకఠోరాలను

వినలేకున్నా

ద్వేషదౌర్జన్యాలాను

చూడలేకున్నా


విషనాగుల మధ్య

జీవించలేకున్నా

స్వార్ధనేతల మధ్య

ఇమడలేకున్నా


ముళ్ళకిరీటాన్ని

పెట్టుకోలేకున్నా

అవినీతిపరుల ఆటలను

అరికట్టలేకున్నా


వ్యధలను

చెప్పలేకున్నా

బాధలను

భరించలేకున్నా

 

నాకు

వెలుగు కావాలి

తోడు కావాలి

లోకశాంతి కావాలి

ప్రజలసౌఖ్యం కావాలి


మీరు

సహకారం అందిస్తారా

రంగములోకి దిగుతారా

అన్యాయాలను ఎదిరిస్తారా

అక్రమార్కుల ఆటలుకట్టిస్తారా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog