కాంచవోయి తెలుగోళ్ళదుస్థితి!
తెలుగోళ్ళు
రేపుతున్న వర్గవైషమ్యాలకు
మోపుతున్న నిందాపనిందలకు
తలవంచుకుంటున్నారు
తెలుగోడి హృదయం
అరుదైన ప్రియపలకరింపులకోసం
కరువైన ప్రేమాభిమానాలకోసం
తపిస్తుంది
తెలుగోడి గుండె
తల్లిభాషకు జరుగుతున్న అన్యాయాలకు
తోటివారిపై జరుపుతున్న దుర్మార్గాలకు
తలడిల్లిపోతుంది
తెలుగోడి మనసు
పాలకుల తలతిక్కపనులకు
నాయకుల తిట్లకుబూతులకు
ద్రవిస్తుంది
తెలుగోడి మది
ప్రాంతాల తిరోగమనానికి
దిగజారిన ఆర్ధికస్థితిగతులకు
బాధపడుతుంది
తెలుగోడి గళం
దుష్టరాజకీయ పన్నాగాలకు
రేపుతున్న కులకుమ్ములాటలకు
మూగపోయింది
తెలుగోడి ప్రాంతం
పెరుగుతున్న మత్తుపదార్ధాల వ్యాప్తికి
పారుతున్న విచ్చలవిడి మద్యంసరపరాకు
ఉడికిపోతుంది
తెలుగోడి వోటు
రాబోయే ఎన్నికలకోసం
తేబోయే మార్పులకోసం
నిరీక్షిస్తుంది
తెలుగోడి కలం
కత్తికంటే పదునుగా
అగ్గికంటే ప్రకాశంగా
కదులుతుంది
ఓరి తెలుగోడా
పరిస్థితి గమనించు
చక్కగా ఆలోచించు
సముచిత నిర్ణయంతీసుకో
ఓరి ఆంధ్రుడా
కుల కుంపట్లకు
మత విద్వేషాలకు
లోనుకాకురా
ఓరి త్రిలింగదేశస్థుడా
ప్రగతి సాధనకు
జాతి పరిరక్షణకు
పాటుపడరా
ఓరి తెనుగోడా
కాకతీయుల కీర్తిని
శాతవాహనుల శక్తిని
వారసుడిగా నిలుపరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment