కమ్మని కబుర్లు


కమ్మనికబుర్లు

చెప్పనా

తీపిజిలేబీలు

తినిపించనా


పెదవులకు

అమృతంఅద్దుకోనా

పలుకులకు

తేనెచుక్కలురాసుకోనా


పిండి వెన్నెలను

కాయించనా

చల్లని గాలిని

వీయించనా


చక్కని అందాలను

చూపనా

మనసుకు ఆనందమును

కలిగించనా


సుమధుర కవితలను

వ్రాయనా

చదువరుల మదులను

దోచుకోనా


ప్రకృతిని

పదాలలో పెట్టనా

కళ్ళను

వెలుగులతో నింపనా


కలమును

కరమున పట్టనా

ఆలోచనలను

అక్షరాలలో పెట్టనా


నవరసాలను

పండించనా

ఆరురుచులను

అందించనా


సంగీతమును

వినిపించనా

సాహిత్యమును

చదివించనా


నేటిభారతాన్ని

వినిపించనా

నేతిగారెలను

తినిపించనా


విందుభోజనానికి

పిలవనా

వినోదాన్ని

పంచనా


తెలుగుఖ్యాతిని

చాటనా

సాహిత్యలోకాన్ని

సంబరపరచనా


కవనజల్లులను

కురిపించనా

కవితాప్రవాహాన్ని

కొనసాగించనా


మరలా మరలా

మిమ్ముల చదివించనా

మనసుల తట్టీముట్టీ

మననం చేయించనా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog