విశృంఖలాలు
నోటికి
హద్దూలేదు పద్దూలేదు
తలచిందే తడవుగా
తూటాలుగా మాటలుప్రేలుస్తుంది
వాన చినుకుల్లా
ప్రేమజల్లులు కురిపిస్తుంది
వసంత కోకిలలా
గానామృతం చిందిస్తుంది
సుమతీ శతకకర్తలా
నీతిని బోధిస్తుంది
మనసుకు
పగ్గాలులేవు సంకెళ్ళులేవు
గాలి వీచినట్లుగా
ఆలోచనలు పరుగెత్తుతాయి
ఆకాశంలో మేఘాల్లా
ఉరుముతాయి మెరుస్తాయి
రెక్కలిప్పిన పక్షుల్లా
ఎగురుతాయి విహరిస్తాయి
కోర్కెలు తీర్చుకోటానికి
కవ్విస్తాయి కష్టపెడతాయి
కవికలానికి
అవధులులేవు అదుపులులేవు
భావాలు పుడితే
బయటకొచ్చి పొంగిపొర్లుతాయి
అక్షరాలు ముత్యాలుగా
అల్లుకుంటాయి పేరుకుంటాయి
పదాలు ప్రాసలతో
పొసగుతాయి పరుగులుతీస్తాయి
ఆయస్కాంతపు శక్తిలా
మనసులనుతాకుతాయి తృప్తిపరుస్తాయి
కవితలకు
కుక్కపిల్ల సబ్బుబిళ్ళ అనర్హంకాదు
పద్యాలు
యతిప్రాసలతో అలరిస్తాయి
వచనకవితలు
భావగర్భితమై వెలుగుతాయి
గేయాలు
గంధర్వగానాన్ని వినిపిస్తాయి
పలుప్రక్రియలు
సాహిత్యలోకాన ప్రవహిస్తాయి
సాహితి
అందాలుచూపుతుంది ఆనందంకలిగిస్తుంది
నదిలా
ప్రవహిస్తుంది
గాలిలా
వ్యాపిస్తుంది
కడలి అలల్లా
ఎగిసిపడుతుంది
జాబిలిలా
వెన్నెలకాస్తుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment