ప్రేమికుల సరసాలు
(యుగళగీతం)
అతడు: ఓ పిల్లా...
పువ్విస్తే ఏమిచేస్తావు
నవ్విస్తే ఏమిచేస్తావు ||పువ్విస్తే||
ఆమె: ఓ బావా...
పువ్విస్తే తురుముకుంటాను
నవ్విస్తే తిప్పికొడతాను ||పువ్విస్తే||
అతడు: ఓ పిల్లా...
కాసులిస్తే ఏమిచేస్తావు
కోకలిస్తే ఏమిచేస్తావు
ఆమె: ఓ బావా...
కాసులిస్తే దాచుకుంటాను
కోకలిస్తే కట్టుకుంటాను
అతడు: ఓ పిల్లా...
చాటుకురమ్మంటే ఏమిచేస్తావు
పాటుకురమ్మంటే ఏమిచేస్తావు
ఆమె: ఓ బావా...
చాటుకురమ్మంటే చటుక్కునవస్తాను
పాటుకురమ్మంటే పరువాలారబోస్తాను
అతడు: ఓ పిల్లా...
రమ్మంటే ఏమిచేస్తావు
పొమ్మంటే ఏమిచేస్తావు
ఆమె: ఓ బావా...
రమ్మంటే రయ్యనవస్తాను
పొమ్మంటే పెదవులుకొరుక్కుంటాను
అతడు: ఓ పిల్లా...
ఆడమంటే ఏమిచేస్తావు
పాడమంటే ఏమిచేస్తావు
అతడు: ఓ బావా...
ఆడమంటే గంతులేస్తాను
పాడమంటే గళమెత్తుతాను
అతడు: ఓ పిల్లా...
ముద్దిస్తే ఏమిచేస్తావు
మందలిస్తే ఏమిచేస్తావు
అతడు: ఓ బావా...
ముద్దిస్తే మురిసిపోతాను
మందలిస్తే మారాంచేస్తాను
అతడు: ఓ పిల్లా...
పువ్విస్తే ఏమిచేస్తావు
నవ్విస్తే ఏమిచేస్తావు ||పువ్విస్తే||
ఆమె: ఓ బావా...
పువ్విస్తే తురుముకుంటాను
నవ్విస్తే తిప్పికొడతాను ||పువ్విస్తే||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment