భూలోకవాసం


నేను ఒక భూలోకవాసిని

నన్ను భూమాత భరిస్తుంది

నాకు ఆహారపానీయాలు అందిస్తుంది

నాకు అందాలుచూపి ఆనందమిస్తుంది 


కొండలు సెలయేర్లు

రమ్మంటున్నాయి

అరణ్యాలు లోయలు

అనుభవించమంటున్నాయి


కాలం

పరుగెత్తుతుంది

ఆలోచనలు

వెంటబడుతున్నాయి


ఆకాశంవైపు ఆశగా చూస్తున్నా

నీరునిస్తుందని

వెలుగునిస్తుందని

వెన్నెలనిస్తుందని


సూర్యుడు

సహాయపడుతున్నాడు

చంద్రుడు

సంతోషపెడుతున్నాడు


కాళ్ళక్రింది పాతాళాన్ని తలుచుకుంటున్నా

మణిమాణిక్యాలనిస్తుందని

ఖనిజలోహాలనిస్తుందని

భూమిని బ్రద్దలుచేయదని


ప్రక్కనున్న సముద్రాన్ని చూస్తున్నా

ఆకాశాన్ని అందుకోవాలని ఎగిరిపడుతుంది

ఎత్తుకు ఎగురుతుంది క్రిందకుపడుతుంది

భూమిని ఆక్రమించుకోవాలని చూస్తుంది


చీకటివెలుగుల పోరాటాన్ని చూస్తున్నా

ప్రొద్దున్నె సూర్యుడొచ్చి ఏలుతుంటే

సాయంత్రం తిమిరమొచ్చి పాలిస్తుంది

రాత్రి చంద్రుడుచుక్కలు అలరిస్తున్నవి


ఆకాశంలో దేవతలున్నారేమోనని

చూస్తున్నా పూజిస్తున్నా

పాతాళంలో బలిసంతానమున్నారేమోనని

భ్రమిస్తున్నా భయపడుతున్నా 


ఎన్నిరోజులు బ్రతకాలో?

ఎందుకోసం జీవించాలో?

ఏమిపనులు చెయ్యాలో?

ఏమేమి సాధించాలో?


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog