కవితాప్రేరణాలు
ఒక దృశ్యం
ఆకర్షిస్తుంది
కలమును పట్టమంటుంది
చక్కగా వర్ణించమంటుంది
ఒక శబ్దం
ఆకట్టుకుంటుంది
కాగితాన్ని తీసుకోమంటుంది
కమ్మగా వ్రాయమంటుంది
ఒక పదం
అంతరంగాన్నితడుతుంది
ఆలోచనలు పుట్టిస్తుంది
కవనం చేయమంటుంది
ఒక పాదం
అతిగానచ్చుతుంది
భావాన్ని దొర్లిస్తుంది
కవితను వెలువరించమంటుంది
ఒక రంగు
కనబడుతుంది
కళ్ళను కట్టేస్తుంది
అక్షరాలను అల్లమంటుంది
ఒక పువ్వు
కనువిందుచేస్తుంది
కవిహృదయాన్ని దోచేస్తుంది
కైతను సృష్టించమంటుంది
ఒక నవ్వు
పకపకలాడిస్తుంది
మోమును వెలిగిస్తుంది
చకచకా రాయమంటుంది
ఒక చూపు
మదినిపట్టేస్తుంది
వన్నెలు చిందుతుంది
కవనం చేయమంటుంది
ఒక ఆకు
రెపెరెపలాడుతుంది
తనకథను చెబుతుంది
బరబరా పుటలకెక్కించమంటుంది
ఒక ఈక
గాలిలో ఎగురుతుంది నేలపైపడుతుంది
పిట్టతో బంధాన్నితెంచుకుంటుంది
తనవ్యధను తెలియపరచమంటుంది
ఒక అనుభవం
ఒక అందం
ఒక ఆనందం
ఓలలాడించి ఉర్రూతలూగిస్తాయి
ఏరోజుకు ఏనిమిషానికి
ఏమివ్రాయాలో ఏవేవోనిర్ణయిస్తాయి
కవిని ప్రేరేపిస్తాయి
కవితలను కూర్పించుతాయి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment