కవితాఝరి
ఒక మెరుపు
మెరిసిందంటే
ఒక ఆలోచన
మదినితట్టినట్లే
ఒక ఉరుము
ఉరిమిందంటే
ఒక భావము
బయటకొచ్చినట్లే
ఒక చినుకు
కురిసిందంటే
ఒక కవితాహృదయం
ద్రవించినట్లే
ఒక ఏరు
ప్రవహించిందంటే
అక్షరసమూహము
పొంగిపొర్లినట్లే
ఒక స్నానం
చేశావంటే
కవితగంగలో
మునిగినట్లే
ఒక పువ్వు
పూచిందంటే
కవితాకుసుమము
విరబూసినట్లే
ఒక సువాసన
వీచిందంటే
కవితాసౌరభము
వ్యాపించినట్లే
ఒక పంట
పండిందంటే
సాహితీలోకము
సుభిక్షమయినట్లే
ఒక పళ్ళెం
నిండిందంటే
కవితాకాంక్ష
తీరినట్లే
ఒక జిహ్వ
తృప్తిపడిందంటే
నవరసాలు
దొరికినట్లే
ఒక కడుపు
నిండిందంటే
కవిత్వాన్ని
ఆస్వాదించినట్లే
ఒక దోసెడునీరు
త్రాగావంటే
కవితాదాహం
సమసినట్లే
ఒక మనసు
ఆనందపడిందంటే
కవితోల్లాసము
లభించినట్లే
ఓ కవితాప్రేమికులారా
తడవండి కవితలలో
మునగండి కవిత్వంలో
తేలండి సాహితీలోకంలో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment