జీవనసమరము
సౌందర్యము చూడాలో
సంతోషము పొందాలో
తెలుసుకోలేకున్నా!
ఊరకుండక తిప్పలెందుకంటా
ఆయుర్దాయము కావాలో
ఆనందము కావాలో
అర్ధము కావటంలా!
తెలిస్తే మాదకద్రవ్యాలను వదలమంటా
సంపదలు కావాలో
సుఖాలు కావాలో
సందిగ్ధములో పడ్డా!
ప్రయాసలు మానివేయమంటా
వెన్నెల కావాలో
వేడి కావాలో
ఇతమిద్ధంగా తెలియటంలా!
రెండింటిని వదులుకోమంటా
పరువం వాడుకోవాలా
పరువు నిలబెట్టుకోవాలా
తేల్చుకోలేకున్నా!
విలువలకు కట్టుబడమంటా
చదువు కావాలో
సంస్కారము కావాలో
సరిగా తెలియటంలా!
సర్దుకొని పొమ్మంటా
మాటలు చెప్పాలా
చేతలు చెయ్యాలా
తెలుసుకోలేకున్నా!
మౌనంగా ఉండమంటా
శక్టి కావాలో
యుక్తి కావాలో
తట్టటంలా!
సమయానుకూలంగా నడుచుకోమంటా
అక్షయపాత్ర కావాలో
కల్పవృక్షము కావాలో
బోధపడటంలా!
అంతామిధ్యయని తలచమంటా
గుణవతి కావాలో
రూపవతి కావాలో
తికమకపడుతున్నా!
బ్రహ్మచారిగా ఉండమంటా
అబ్బాయి కావాలో
అమ్మాయి కావాలో
నిర్ణయించుకోలేకున్నా!
ఎవరైనా పెంచకతప్పదంటా
సంసారములోకి దిగనా
సన్యాసమును పుచ్చుకోనా
చర్చించుకుంటున్నా!
ఏదైనా తప్పదుగాజీవితసమరమంటా

Comments
Post a Comment