భావిభారతపౌరుల్లారా! భాగ్యవిధాతల్లారా!


అన్నెంపున్నెం ఎరుగని

పిల్లల్లారా!

తల్లితండ్రుల చాటునున్న

బాలల్లారా!


మంచీచెడూ తెలియని

కూనల్లారా!

భావిభారతదేశపు

పౌరుల్లారా!


రంగురంగుల పూలనుచూచి

వింతవింత సీతాకోకచిలుకలచూచి

చిటపట కురిసే చినుకులచూచి

పకపకలాడే చిన్నారుల్లారా!


చక్కని నీలిగగనంలోని జాబిలినిచూచి

సప్తవర్ణాల హరివిల్లును చూచి

మాకోసమే కళ్ళముందుకు వచ్చాయనుకుని

ముచ్చటపడే చిట్టిపాపల్లారా!


కిచకిచలాడే కోతులచూచి

కిలకిలరవములుచేసే పక్షులచూచి

గలగలపారే నీటినిచూచి

తవతవలాడే బుజ్జాయిల్లారా!


ఉరుములమెరుపుల మేఘాలను చూచి

తళతళలాడే తారలను చూచి

ఉరుకులుతీసే ఉడుతలను చూచి

తమకోసమేవచ్చాయననుకొనే  బిడ్డల్లారా!


ఉదయిస్తున్న అరుణుని చూచి

ఎగిసిపడుతున్న కడలి అలలనుచూచి

చెంగుచెంగున గంతులువేసె ఆవుదూడలచూచి

సంతసపడే చిట్టిపాపాయిల్లారా!


భూగోళం మీదిరా

పుడమిపచ్చదనం మీదిరా

కొండలుకోనలు మీవిరా

క్రిందకు ఉరికేసెలయేర్లు మీవిరా


కుహూకుహూకూసే కోయిలలను కనరా

నాట్యంచేసే నెమలుల కాంచరా

ఎర్రముక్కు పచ్చచిలుకలపై దృష్టిసారించరా

పరుగులుతీసే జింకల పరికించరా


పూలుపూస్తాయిరా మీకోసం

గాలివీస్తుందిరా మీకోసం

మేఘాలుకురుస్తాయిరా మీకోసం

నదులుప్రవహిస్తాయిరా మీకోసం


దేశం మీదిరా

విశ్వం మీదిరా

భవితవ్యం మీదిరా

భోగభాగ్యాలు మీవిరా బుడతల్లారా


నా కవనం మీకేరా

నా గానం మీకేరా

నా ఆలోచనలు మీకేరా

నా దీవెనలు మీకేరా పిల్లకాయల్లారా


ఎదగండి

ఎరగండి

ఏలుబడికిరండి

ఎనలేనిఖ్యాతినిపొందండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog