చపలచిత్తము

(నామనసు)


మనసు ఉబలాటపడుతుంది

అందచందాలను చూచి

ఆస్వాదించి తీరాలని


మనసు తిరుగుతుంది

దొరికినదంతా దోచుకొని

దొంతరలో దాచుకోవాలని


మనసు కాచుకొనియున్నది

ఎదురుపడిన దృశ్యాలనుకాంచి

ఎదలో పదిలపరచుకోవాలని


మనసు పరుగెత్తుతుంది

పలాయిస్తున్న వాటిని

పట్టుకొని బుట్టలోవేసుకోవాలని


మనసు ముచ్చటపడుతుంది

మంచిమాటలను విని

మదిలో మూటకట్టుకోవాలని


మనసు ద్రవిస్తుంది

కష్టాలబారిన పడ్డవారి

కడు కడగండ్లనుచూచి


మనసు మండిపడుతుంది

పాపాలు చేసేవారిని

పట్టుకొని దండించాలని


మనసు నవ్వుతుంది

పువ్వుల పొంకాలనుచూచి

పరిమళాలను ఆఘ్రానించాలని


మనసు దుఃఖిస్తుంది

మనుజులు మానవత్వాన్ని

మరచిపోయి మెలగుతున్నారని


మనసు మోహంలోపడింది

అందాలను సొంతంచేసుకోవాలని

ఆనందాన్ని పొందాలని


మనసు భ్రాంతిలోపడింది

ఉన్నవిలేనట్లు లేనివియున్నట్లుతలచి

మహామాయలో చిక్కుకొని


మనసు మురిసిపోతుంది

నేలకప్పుకున్న పచ్చదనాన్నిచూచి

నెత్తిమీది నీలిగగనాన్నికని


మనసు చిక్కుకుంది

ముసరుకున్న కోరికలవలకి

మమతానురాగాల బంధానికి


మనసు ఊగుతుంది

ఊగుతున్న కొమ్మలపోలి

ఊపిన ఉయ్యాలమాదిరి


మనసు ఉవ్విళ్ళూరుతుంది

మంచి కవితలువ్రాసి

మహాకవిగా నిలవాలని


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


ప్రాసలకోసం 

పాటుబడ్డా

పదప్రయోగానికి

పెద్దపీటవేశా


విషయాన్ని

వడ్డించా

విపులంగా

వివరించా


మదులను

ముట్టాలనుకున్నా

మనసును

ముందుంచాలనుకున్నా


సఫలమైతే

సంతసిస్తా

విఫలమైతే

విచారిస్తా



Comments

Popular posts from this blog