ప్రకృతిస్వగతం
(ప్రకృతిపరవశం)
తూర్పున తెల్లవారకముందే
తరువులకు పూలుతొడుగుతా
తళతళలాడే రంగులేస్తా
తేనెచుక్కలతో నింపేస్తా
తూర్పుదిక్కుకు రవినితీసుకొస్తా
వెలుగులను చిమ్మిస్తా
చీకటిని పారదోలతా
ప్రాణులను మేలుకొలుపుతా
పక్షుల నెగిరిస్తా
కిలకిలారవములు చేయిస్తా
కడుపులు నింపేస్తా
ప్రజలను పనులకుపంపేస్తా
అకాశానికి నీలిరంగునద్దుతా
మేఘాలను సృష్టిస్తా
ఉరుములురిమిస్తా మెరుపులుమెరిపిస్తా
ఇంద్రధనస్సును చూపిస్తా
వానలు కురిపిస్తా
వాగులువంకలు పారిస్తా
మొక్కలదాహం తీరుస్తా
కాయలుకాయిస్తా పంటలుపండిస్తా
పుడమిని పచ్చబరుస్తా
కానలను పెంచేస్తా
కొండాకోనల నలంకరిస్తా
సెలయేర్లను జాలువారిస్తా
విరులను వికసింపజేస్తా
పరిమళాలను వెదజల్లుతా
ప్రేమాభిమానాలు రేపుతా
ప్రజలను పరవశపరుస్తా
కోకిలలను కూయిస్తా
నెమలుల నాడిస్తా
మదులను దోచేస్తా
ముచ్చట పరిచేస్తా
నదీతీరాలకు నవ్యతనిస్తా
కడలితీరాలను ముస్తాబుచేస్తా
అలల నెగిరిస్తాపడవేస్తా
కనులకు కనువిందుజేస్తా
సూరీడికి విశ్రాంతినిస్తా
చీకటిని పిలుస్తా
జాబిలిని పొడిపిస్తా
వెన్నెలను కురిపిస్తా
మదులను తట్టేస్తా
మనుషుల నానందపరుస్తా
నిద్రలోనికి పంపుతా
అలసటలు తీరుస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ప్రకృతిని పరికించుదాం
ప్రకృతిని ప్రేమించుదాం
ప్రకృతిని పూజించుదాం
ప్రకృతిని పరిరక్షిద్దాం
ప్రకృతి పుడమికిప్రాణం
ప్రకృతి పరమాత్మునివరం
ప్రకృతి ప్రతినిత్యనూతనం
ప్రకృతి పరమానందకరం
ప్రకృతిశోభ
ప్రమోదభరితం
ప్రకృతిసృష్టి
ప్రశంసనీయం
ప్రకృతిశోభకు
ప్రణామం
ప్రకృతిధర్మానికి
నీరాజనం
Comments
Post a Comment