పూలవిన్యాసాలు
అదిగో కుటపము
అవిగో కల్పవృక్షాలు
అల్లవిగో కొమ్మలు
అందవిగో కుసుమాలు
రకరకాల పూలు
రమ్యమైన పూలు
రంజనచేసే పూలు
రుతువులోపూచే పూలు
తేనెలొలికే పూలు
తేటులపిలిచే పూలు
తరువులుతొడిగిన పూలు
తరుణులకొప్పులలో తురిమినపూలు
మందిరాలలో పూలు
మండపాలలో పూలు
సమావేశాలలో పూలు
సన్మానసత్కారాలలో పూలు
పువ్వుపువ్వుదో అందం
కళ్ళను కట్టేస్తాయి
మనసులను ముట్టేస్తాయి
పరికించువారిని పట్టేస్తాయి
పువ్వుపువ్వుదో సరసం
కొన్ని కనమంటాయి
కొన్ని కోసుకోమంటాయి
కొన్ని కైపట్టమంటాయి
పువ్వుపువ్వుదో పరిమళం
మల్లెలు మురిపిస్తాయి
సంపంగెలు సంతసపరుస్తాయి
సుమసౌరభాలు సంతృప్రిపరుస్తాయి
పువ్వుపువ్వుదో పరిహాసం
నవ్వులు చిందిస్తాయి
మోములు వెలిగిస్తాయి
వయ్యారాలు ఒలికిస్తాయి
పువ్వుపువ్వుదో వర్ణం
వన్నెలతో వలవేస్తాయి
ప్రకాశంతో పులకరిస్తాయి
రంగులలోకంలొ విహరింపజేస్తాయి
పువ్వుపువ్వుదో ప్రకాశం
వెలిగిపోతాయి
చెలరేగిపోతాయి
కళకళలాడుతాయి
పువ్వుపువ్వుదో ప్రేరణం
ఆలోచనలు రేపుతాయి
భావాలను బయటపెట్టిస్తాయి
సాహితిని సుసంపన్నంజేయిస్తాయి
పువ్వుపువ్వుదో ఆరాటం
కవులను కవ్వించాలని
కవితలను వ్రాయించాలని
కవనంలో ముంచేయాలని
పూలవిన్యాసాలు కనండి
పూలసందేశాలు వినండి
పూలబాణాలు విడువండి
పూలకవనాలు చదవండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కుటపము= తోట
Comments
Post a Comment