మామంచి మశకము
నిన్నరాత్రి ఇంటిలో ఒంటరిగానున్నా
కవితరాయాలని ఆలోచిస్తున్నా
ఇంతలో ఒకమశకమొచ్చింది
మాట్లాడింది విషయాన్నిచ్చింది
రాత్రి ఒకదోమ దగ్గరకొస్తుంది
వెంటనే దూరంగా ఎగిరిపోతుంది
కుట్టటంలేదు తాకటంలేదు
రక్తంపీకటంలేదు ఆకలితీర్చుకోవటంలేదు
చెవుల దగ్గరకొస్తుంది
ఏదో చెప్పాలని చూస్తుంది
బాధపడుతుంది బలహీనంగాయున్నది
పలకరించాలని చూస్తుంది
చొరవతీసుకొని
అడిగాను ఎందుకు సందేహిస్తున్నావని
ఏమైందని
ఏమికావాలని
మూడురోజులనుండి
ఆహారంలేదని
పస్తులున్నానని
ఒపికలేదన్నది
మొన్న పెద్ద భవంతిలోకెళ్ళా
పగలంతా ఇంటిలో దాక్కున్నా
రాత్రి రుచికరమైన రక్తంత్రాగాలనుకున్నా
ఇంటిలో మందుచల్లారు తెరలేశారు కుట్టలేకపోయా
నిన్న ఓ మధ్యతరగతి ఇంటికెళ్ళా
ఒకగదిలో వృద్ధదంపతులు బాధపడుతున్నారు
మరోగదిలో తల్లీపిల్లలు అనారోగ్యంతో ఉన్నారు
నాకు కుట్టాలనిపించలా ఆకలితోవెనుతిరిగా
నేడు నీ ఇంటికొచ్చా
నిన్ను చూచా
నువ్వు కవివని తెలుసుకున్నా
నిన్ను కరవలేకపోతున్నా అన్నది
జాలి పడ్డా
కన్నీరు కార్చా
చెయ్యిని చాచా
రక్తం త్రాగమన్నా
కుడితే నొప్పిపుడుతుందని
రోగాలు వస్తాయని
దబ్బు ఖర్చవుతందని
పాపం తగులుతుందని అన్నది
నీలాంటివారి రక్తంత్రాగనని
ఎన్నిరోజులయినా పస్తులుంటానని
మంచికవితనొకటి వ్రాయమనిచెప్పి
గాలిలో బయటకెగిరిపోయింది
మంచి దోమలుంటాయని
వాటికి మనసుంటుందని
మనిషులకంటె మంచిగున్నదని
విస్తుపోయా వాపోయా వ్రాశాకవితని
చదవండి
జాలిచూపండి
తిట్టకండి
ఉసురుపోసుకోకండి
అందరు
రాక్షసులు కారు
అందరు
చెడ్డవారు కారు
అందరు
దేవతలు కారు
అందరు
మంచివారుకారు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment