వ్రాస్తా వ్రాస్తుంటా! 


రానీ రాకపోనీ

పేరుప్రఖ్యాతులు

ప్రశంసాపత్రాలు 

పేపర్లలో ఫొటోలు 

బహుమతులు బిరుదులు

భుజాన శాలువాలు

మెడన పూలదండలు 

కరాన పుష్పగుచ్ఛాలు


దక్కనీ దక్కకపోనీ

మాట్లడటానికి మైకులు 

పత్రికలలో ప్రాచుర్యాలు

ఆకాశవాణిలో వార్తలు 

దృశ్యమాధ్యమాలలొ వీడియోలు

చొక్కాలకు రంగులబాడ్జీలు

సన్మానాలు సత్కారాలు 

పొగడ్తలు కరతాళధ్వనులు


పోనీ పోతేపోనీ

భార్య బంధువులు

తల్లి తండ్రులు

కొడుకులు కోడళ్ళు

కూతుర్లు అల్లుళ్ళు

మనవళ్ళు మనవరాళ్ళు

హితులు స్నేహితులు


చదవనీ చదవకపోనీ

కష్టపడి వ్రాసినకవితలు

అందంగాగుచ్చిన అక్షరాలు

ఏరికోరిపేర్చిన పదాలు

ప్రయోగించిన ప్రాసలుమాత్రలు

వాడిన ఉపమానాలురూపకాలు


వెలగనీ వెలగకపోనీ

సూర్యుని కిరణకాంతులు

చంద్రుని వెన్నెలజల్లులు

తారల తళుకుబెళుకులు

మెరుపుల విద్యుత్తుప్రకాశాలు

మోములందు చిరునవ్వులు


కనిపించనీ కనిపించకపోనీ

ప్రకృతి అందాలు

వికసించిన అరులు

కడలిలోని అలలు

నల్లని అంబుదాలు

నాట్యమాడే అర్జునాలు


తలుస్తా తలపుకుతెస్తా

శ్రీశ్రీ విప్లవగీతాలను

కృష్ణశాస్త్రి భావకవితలను

ఆత్రేయ మనసుకవిత్వమును

పాపయ్యశాస్త్రి పుష్పకవనమును

గురజాద వ్యావహారికబాషను

పలుకవుల ప్రణయప్రబోధరచనలను


ఏదైనా ఏమైనా

వదలను కలమును

మూయను గళమును

ఆపను ఆలోచనలను

దాచను భావాలను

దోస్తాను మనసులను


వ్రాస్తా వ్రాస్తుంటా

ఊహలు ఉడిగేదాకా

శక్తి సమసిపోయేదాకా

కళ్ళు కాంచగలిగేదాక

చివరి శ్వాసదాక

ప్రాణం పోయేదాకా

చచ్చి శవమయేదాకా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


అంబుదాలు= మేఘాలు

అర్జునాలు= నెమలులు, మయూరాలు



Comments

Popular posts from this blog