తామరపువ్వు


ఆ తామర

సూర్యుడినిచూచింది

సంతోషపడింది

వికసించింది

వయ్యారమొలుకుతున్నది


ఆ పద్మము

అందాలు చిమ్ముతుంది

ఆనందము కలిగిస్తుంది

కనువిందుజేస్తుంది

కళకళలాడుతుంది


ఆ కమలము

సరసు మధ్యన

ఆకుల మధ్యన

మొగ్గల మధ్యన 

వెలుగులు చిమ్ముతుంది


ఆ సరోజము

ఎవరినో చూస్తుంది

ఎందుకో పిలుస్తుంది

ఎదలను తడుతుంది

ఏదో చెయ్యబోతుంది


ఆ అరవిందము

చెరువుకు అందము

లక్ష్మికి ఆసనము

కళ్ళకు కమ్మదనము

ప్రకృతికి పరవశం


ఆ తోయజము

ఒక మన్మధబాణము

తగిలిన లేపునుతాపము

పుట్టించును విరహము

కలిగించును వేదనము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


వసంత వధువుకు

తామరే సిరిమోము

తామరే నయనాలు

తామరే అధరాలు

తామరే సోయగాలు


మన్మధుని అంబులపొదిలో

మహోత్పలము మొదటిది 

తుమ్మెదలను స్వాగతించటంలో

తొలిస్థానము తోయజముది


కళ్ళల్లో ఉంటే కమలనేత్రం

చెరువులో ఉంటే కమలాకరము

మనసులో ఉంటే మనోహరం

చేతిలో ఉంటే కరకమలం


తామర శోభాయమానం

మన జాతీయపుష్పం

శుభాలకు చిహ్నం

పరమ పవిత్రం


పదములుచాలకున్నవి

పంకజములవర్ణించ

పద్మకవితవ్రాయంగ

పాఠకులపంపంగ


తామరమాదిరి నిలబడండి

కోరినవాటికి పోరాడండి

తామరలను ప్రేమించండి

లక్ష్మిప్రసన్నం పొందండి



Comments

Popular posts from this blog