నమ్మండి నమ్మకపోండి
గాయాలు కనబడటంలా
కానీ గుండెలు విలపిస్తున్నాయి
కళ్ళు కన్నీరు కారుస్తున్నాయి
మనసులు బాధలు పడుతున్నాయి
దోమలు కనబడటంలా
కానీ కాళ్ళను కుడుతున్నాయి
చేతులను పీకుతున్నాయి
రక్తాన్ని త్రాగుతున్నాయి
దారి కనబడటంలా
కానీ ప్రయాణాలు కొనసాగుతున్నాయి
బాటనువెదికే ప్రయత్నాలు జరుగుతున్నాయి
గమ్యం చేరుకోవాలనే తపనలగపడుతున్నాయి
చీకటిలో ఏమీకనబడటంలా
కానీ చేతితో తడుముతున్నారు
కళ్ళను పొడిచి చూస్తున్నారు
మీటనొక్కి దీపాలు వెలిగిస్తున్నారు
సమానత్వం కనబడటంలా
ఆడామగా భేదాలున్నాయి
పేదాధనికుల వ్యత్యాసాలున్నాయి
బలహీనులబలవంతుల తేడాలున్నాయి
దాతలు కనబడటంలా
కానీ అన్నంలేక అలమటించేవారున్నారు
ఆదుకునేవారులేక ఆర్తానాదాలు చేసేవారున్నారు
సాయపడేవారులేక చేయిచాచి అడుక్కునేవారున్నారు
దేవుడు కనబడటంలా
కానీ చర్యలు చూస్తున్నాం
మహత్యాలు వింటున్నాం
పురాణాలు పఠిస్తున్నాం
లక్ష్మీదేవి కనబడటంలా
కానీ గాజులుగలగలమంటున్నాయి
గజ్జెలు మ్రోగుతున్నాయి
గృహాలు కలిమితోనిండిపోతున్నాయి
వాణీదేవి కనబడటంలా
కానీ ప్రేరణలు పుడుతున్నాయి
కలాలు పరుగెడుతున్నాయి
కవితలు పుట్టుకొస్తున్నాయి
మహాకవులు కనబడటంలా
కానీ కవనాలు చదువుతున్నాం
కవితలు వింటున్నాం
ఆనందం పొందుతున్నాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment