కవితలు క్వణములు


కవితాక్వణములు కవ్విస్తుంటే

కర్ణాలకింపు కలుగుతువుంటే

కలముకరానికి చేరుతుయుంటే

కవనంసాగదా! కవితలుపుట్టవా!


గుడిగంటలు గణగణమ్రోగుతుంటే

గుడిలోపూజలు జరుగుతువుంటే

గళమెత్తి దేవునిప్రార్ధించనా

కలముపట్టి భక్తిపాటవ్రాయనా!


బడిగంట పొద్దునేమోగుతుంటే

బాల్యపురోజులు తలపునకొస్తే

గతఙ్ఞాపకాలు వెంటపడితే 

బాలగేయము వ్రాసిపాడనా!


కోకిలగానము వినబడుతుంటే

కంఠము సరిచేసుకోవాలనిపిస్తే

కమ్మదనము ఆస్వాదించాలనిపిస్తే

కాగితాలపై అక్షరాలనెక్కించనా!


గాజులు గలాగలాలాడుతుంటే

చక్కనిచేతులు కనబడుతుంటే

అందాలను చూడాలనిపిస్తుంటే

అద్భుతకవితను వెలువరించనా!


తుమ్మెదలు ఝుమ్మంటుంటే

చెవులు నిక్కపొడుచుకుంటే

కళ్ళచూపులు పూలమీదపడితే

కవితలు పుటలకెక్కించనా!


గజ్జెలు ఘల్లుఘల్లుమంటుంటే

గుండె ఝల్లుమంటుంటే

మది మురిసిపోతుంటే

కవితలవరద పారించనా!


ఉరుములు పెళపెళమంటుంటే

మెరుపులు మిలమిలమెరుస్తుంటే

చినుకులు చిటపటపడుతుంటే

కవితలు గబగబాకురిపించనా!


గుండె లబ్ డబ్ మంటుంటే

స్టెతస్కోపు చెవిలోధ్వనిస్తుంటే

జీవనరాగము వినిపిస్తుంటే

జీవితకవితను వ్రాయనా!


శిశువులు ముద్దుగామాట్లాడుతుంటే

చిలుకపలుకులు పలుకుతుంటే

భుజాలపైకి ఎక్కించుకోవాలనిపిస్తుంటే

బాలలకవితను చేబట్టనా!


కోడి పొద్దునేకూస్తుంటే

మేలుకోవాలనిపిస్తుంటే

మదిలోతలపులూగుతుంటే

భావకవితను బయటపెట్టనా!


సన్నాయి పందిట్లోవినబడుతుంటే

వధూవరులను చూడాలనిపిస్తుంటే

ఆశీర్వచనాలు అందించాలనిపిస్తుంటే

ప్రణయకవితలు కూర్చనా!


కవిత కళ్ళముందుకొస్తే

కమ్మనికైతను వ్రాయమంటే

కాదని తిరస్కరించగలనా

కోరికతీర్చకుండా ఉండగలనా! 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


క్వణములు= శబ్దములు, ధ్వనులు



Comments

Popular posts from this blog