కాలమా ఆగిపో!
తెల్లవారితే
నిద్రలేవాలి
పరుగులుతియ్యాలి
పనులకువెళ్ళాలి
సూర్యుడా నిలిచిపో
ఉదయించకు
కిరణాలు ప్రసరించకు
చీకటిని పారదోలకు
చతుర్దశి చందమా
పెరగకు తరగకు
పెరిగితే తరుగుతావు
వెన్నెల కురియనంటావు
గడియారమా
విశ్రాంతితీసుకో
తిరగకు
పరుగులుతీయకు
వసంతమా నిలిచిపో
మల్లెవాసనలు పీలుస్తా
మామిడిఫలాలు తింటా
కోకిలగానం వింటా
గ్రీష్మమా రాకురాకు
ఎందలు మండించకు
చెమటలుపట్టించకు
బాధలుకలిగించకు
చలికాలమా
దూరంగావెళ్ళిపో
మంచుకురిపించకు
ఒళ్ళువణికించకు
వర్షాకాలమా
రావద్దు వెనక్కిపో
తడపకు బంధించకు
రోగాలు తెప్పించకు
యవ్వనమా
శాశ్వతంగావుండిపో
సరదాలనాపకు
వృద్ధాప్యంలోకినెట్టకు
రోజులుగడిస్తే
వయసుపెరుగుతుంది
ఆయుస్సుతరుగుతుంది
వాతావరణంమారుతుంది
కాలచక్రమా
ముందుకుకదలకు
కష్టపెట్టకు
ఋతువులుమార్చకు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment