ప్రకృతీపురుషుల కళ్యాణం
నీలిరంగును
నింగికిపూస్తా
కళ్ళకు
కమ్మదనమిస్తా
నిండుచంద్రుని
నభోవీధిలోనుంచుతా
మనసులను
మురిపిస్తా
తెల్లనివెన్నెలను
విరజిమ్ముతా
చల్లనిగాలిని
వ్యాపింపజేస్తా
పలురంగుల
పూలనుపూయిస్తా
పొంకాలుచూపి
పులకరింపజేస్తా
పచ్చదనంతో
పుడమినికప్పుతా
పరికించువారికి
పరమానందమిస్తా
తూనీగల
నెగిరిస్తా
సీతాకోకచిలుకల
తిప్పుతా
ప్రభాతసూర్యుని
ఉదయింపజేస్తా
అరుణకిరణాలను
ప్రసరింపజేస్తా
వన్నెచిన్నెలను
విసురుతా
వయ్యారాలను
ఒలకబోస్తా
అందాలను
చూపిస్తా
ఆనందాన్ని
కలిగిస్తా
కళ్ళను
ఆకట్టుకుంటా
మదులను
దోచుకుంటా
పురుషుడవు నీవైతే
ప్రకృతిని నేనవుతా
ప్రపంచాన్ని
ప్రకాశింపజేస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment