ప్రశ్నిస్తా!
కవిని
అక్షరాలతో ప్రశ్నిస్తా
సమాజాన్ని చైతన్యపరుస్తా
మదులనుతట్టి దోచుకుంటా!
మనిషిని
పెదవులతో ప్రశ్నిస్తా
ఆలోచనలను రేకొడతా
మానవత్వం చూపమంటా!
ఙ్ఞానిని
మాటలతో ప్రశ్నిస్తా
మనసులకు పనిపెడతా
దీర్ఘాలోచనలలోకి దింపుతా!
ప్రేమికుడిని
కళ్ళతో ప్రశ్నిస్తా
మనసును తెలుపుతా
మమకారాన్ని పంచుతా!
ఆలోచనాపరుడిని
మౌనంతో ప్రశ్నిస్తా
అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా
అందరిని దారికితీసుకొస్తా!
తెలిసినవాడిని
నవ్వుతో ప్రశ్నిస్తా
సమస్యలు సృష్టించొద్దంటా
సరళపరిష్కారాలు సూచిస్తా!
విప్లవకారుడిని
పిడికిలెత్తి ప్రశ్నిస్తా
త్యాగానికి సిద్ధపడతా
అన్యాయాలపై పోరాడతా!
గాయకుడను
పాటలతో ప్రశ్నిస్తా
ప్రజలను సంఘటితంచేస్తా
ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటా!
సంస్కర్తను
మూఢాచారాలను ప్రశ్నిస్తా
సమాజశ్రేయస్సును కోరతా
మార్పుకోసం ప్రయత్నిస్తా!
సత్యాగ్రహిని
దీక్షచేసి ప్రశ్నిస్తా
నలుగురిని కూడగడతా
సమస్యలకు పరిష్కారాలుచూపుతా!
నోరున్నవాడిని
గళమెత్తి ప్రశ్నిస్తా
బహిరంగంగా భాసించుతా
చెప్పినట్లు నడుచుకోమంటా!
చదివినవాడిని
పరీక్షపెట్టి ప్రశ్నిస్తా
సమాధానాలు తెలుపమంటా
తెలివిని లెక్కిస్తా!
నేతను
ఓటర్లను ప్రశ్నిస్తా
సరైననిర్ణయం తీసుకోమంటా
ప్రలోభాలకు లొంగొద్దంటా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment