ఓ కథానాయిక కథ


పువ్వుపరిమళాన్ని

బట్టలపై తైలమునయినా

చంద్రముఖిని

ఇంటిలో గుడ్డిదీపాన్నయినా


కోకిల కంఠాన్ని

కాకి గోలనైనా

కేకి సోయగాన్ని

కాకరూక వికారినైనా


స్వేచ్ఛా విహంగాన్ని

పంజరంలో చిలుకనైనా

ఇంటికి మహాలక్ష్మిని

నాలుగుగోడలమధ్య బందీనైనా


మూతిని మూసుకొని

మూగదాన్నయినా

కళ్ళు కప్పుకొని

కబోదినయినా


కథలో నాయకిని

కష్టాలకు ప్రతీకనైనా

కోరికలను వెల్లడించలేని

దీన మౌనవ్రతినైనా


కన్నీటిని రాల్చకున్నా

కోపాన్ని అణచుకున్నా

కష్టాలను ఓర్చుకుంటున్నా

కుటుంబానికి బానిసనైనా


అందాలను కొంగుచాటున 

దాచుకుంటున్నా

ఆనందాలకు దూరముగ

బ్రతుకుతున్నా


వాడిన పువ్వులా

రాలిన పత్రములా

జీవచ్ఛవంలా

కాలం వెళ్ళబుచ్చుతున్నా


కరుగుతున్న కొవ్వొత్తినైనా

గాలికికొట్టుకుంటున్న దీపాన్నయినా

ఖాళీ కడుపునైనా

శక్తిహీనురాలునైనా


శిల్పిచెక్కిన విగ్రాహాన్నయినా

చిత్రకారుడు గీసినబొమ్మనైనా

సినిమాలో విషాదనాయికనైనా

సుకవివ్రాసిన కమ్మనికవితనైనా


భర్తకు వినోదవస్తువునైనా

ఇంటికి పనిమనిషినైనా

పిల్లలుకనే యంత్రాన్నయినా

జైలులోపెట్టిన జీవితఖైదీనైనా


కలలు కల్లలయ్యాయి

నమ్మకం సడలిపోయింది

విశ్వాసం వీగిపోయింది

విలువలు కుప్పకూలాయి


బేలతనం

బోసిపొయ్యింది

చిరునవ్వులు

చెదరిపోయాయి


అస్థిత్వం

అంతరించింది

ఔన్యత్వం

మంటకలిసింది


స్వేచ్ఛకోసం

తల్లడిల్లుతున్నా

మోక్షంకోసం

వీక్షిస్తున్నా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


కేకి= నెమలి

కాకరూకము= గుడ్లగూబ



Comments

Popular posts from this blog